- రేసులో పలువురు విద్యా సంస్థల అధినేతలు, విద్యావేత్తలు
- పోటీకి ఆసక్తి చూపని సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
- ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పై ఆశలు
హైదరాబాద్, వెలుగు: కరీంనగర్, మెదక్, నిజామా బాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన పోటీ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ, సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి మొదట్లో పోటీకి సిద్ధమైనా.. మారిన పరిస్థితుల్లో ఆయన మనసు మార్చుకున్నట్టు పార్టీ వర్గాలు చెప్తు న్నాయి. వచ్చే మార్చిలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నట్టు గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. తనకు ఆ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని పీసీసీ నాయకత్వాన్ని జీవన్ రెడ్డి కోరుతున్నట్టు చెప్తున్నారు.
కొన్ని రోజుల క్రితం పీసీసీ కార్యవర్గం సమావేశమై.. తిరిగి జీవన్ రెడ్డి పేరును ప్రతిపాదిస్తూ హైకమాండ్ కు పంపింది. ఆయన కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. అయితే, గత కొన్ని రోజులుగా జీవన్ రెడ్డి ఈ స్థానం నుంచి పోటీపై పునరాలోచనలో పడినట్టు తెల్సింది.
విద్యా సంస్థల అధినేతలు, విద్యావేత్తల ప్రయత్నాలు
ఈ స్థానం నుంచి పోటీకి పలు విద్యా సంస్థల అధినేతలు, విద్యావేత్తలు ఉవ్విళ్లూరుతున్నారు. కరీంనగర్ లోని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, ఎమిగోస్ విద్యా సంస్థల యజమాని రమణా రెడ్డి, రిటైర్డ్ పోలీసు అధికారి గంగాధర్, విద్యావేత్త ప్రసన్న హరికృష్ణ, పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వెలిచాల రాజేందర్ రావుతో పాటు మరికొందరు పోటీకి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
తమకు పార్టీ తరఫున అవకాశం కల్పించాలని ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ చార్జ్దీపాదాస్ మున్షీని కలిసి తమ ఆసక్తిని తెలియజేశారు. ఇందులో కొందరు సీఎం రేవంత్ రెడ్డిని సైతం కలిసి అవకాశం ఇవ్వాలని కోరినట్టు సమాచారం.
ఇంకా నిర్ణయానికి రాని పీసీసీ.
మార్చిలో ఖాళీ అవుతున్న ఈ స్థానానికి వచ్చే నెలాఖరులో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే, వ్యవధి ఎక్కువ లేకపోవడంతో టికెట్ కోసం ఎవరికి వారే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఈ విషయంలో పీసీసీ ఇంకా ఒక నిర్ణయానికి మాత్రం రాలేదు. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికే ఎక్కువ మంది మద్దతు ఇస్తున్నారని ఇటీవల మీడియాతో చిట్ చాట్ లో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ చెప్పారు.
అయితే, దీనిపై పార్టీ పరంగా వచ్చిన ఒత్తిళ్ల కారణంగా ఆ వెంటనే ఆయన మాట మార్చారు. ఇంకా ఎవరి పేరు ఫైనల్ కాలేదని మహేశ్ గౌడ్ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దీంతో ఆశావహులు ఎవరికి వారే టికెట్ కోసం లాబీయింగ్ చేస్తున్నారు. అధికార పార్టీ నుంచి పోటీ చేస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్న పలువురు.. కాంగ్రెస్ మద్దతుతో పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు.